Thursday 9 May 2024

వెస్ట్ బెంగాల్-1








25.3.2024 ఉదయం 5.30 కి ఇంటి నుంచి బయలుదేరాము ఆరుగురు కుటుంబసభ్యులము. 

మొదట హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కు వచ్చాము. అక్కడ, ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరే ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో కలకత్తాకు మా ప్రయాణం. ఈ మొత్తం టూర్ ప్లానర్ స్ Indira Jonnalagadda, Lakshmi Palaparthi గారి అమ్మాయి వీణ, అల్లుడు కలిసి చేశారు. 

లక్ష్మీ మా అందరికీ బ్రేక్ ఫాస్ట్ కోసం వేడివేడి ఇడ్లీలు చేసి తెచ్చింది. కారంపొడి నెయ్యి, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితో అవి 7.30 కల్లా తినేసాము. మొత్తం లగేజ్ చెకిన్ చేసి,   ఎయిర్ పోర్ట్ లో,  మా విమానం కోసం మొత్తం నడక 25 నిమిషాలు నడిచే సరికి అలిసి, ఆకలితో చక్కని అల్పాహారం తిని, విమానం ఎక్కి చక్కగా ఒకనిద్ర పూర్తి చేసాము. 

కలకత్తా, "సుభాష్ చంద్రబోస్" విమానాశ్రమంలో, చెక్ అవుట్ చేసుకుని బయటకు మా లగేజ్ తో పాటు వచ్చాము. అప్పటికే మా కొరకు వచ్చిన మా వెస్ట్ బెంగాల్ టూర్ ప్లానర్ పంపిన మా వాహనచోదకుడు వచ్చి ఉన్నాడు, ఒక శుభవార్తతో! ఆరోజు హోలీపౌర్ణమి కారణంగా పూర్తిగా వెస్ట్ బెంగాల్ కు సెలవుకారణంగా ఏమీ ఉండవు అని, ఇవాల్టికి చక్కగా హోటల్ గదిలో విశ్రాంతిగా ఉండమని మమ్మల్ని హోటల్ లో చెక్ ఇన్ చేయించి వెళ్ళిపోయాడు. 

ఇక హోటల్ అతనితో మాట్లాడితే, తనకు తెలిసిన కారు ఒకటి మాట్లాడి, చక్కని క్రొత్త కారోకటీ మాట్లాడి, ఆలయాలు తీసే ఉంటాయి, కనుక అవిమాత్రమే చూడగలమని చెప్పి చెకిన్ చేయించాడు. హోటల్ గదుల్లో సామాను పెట్టుకుని చక్కగా వారిచ్చిన కాఫీ త్రాగి, కొంచెం సేపు ఆలోచించుకుని, ఆలయదర్శనాలకు  వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాము. 

అక్కడే మధ్యాహ్నం భోజనంలో కలకత్తా రసగుల్లాతో మొదలు పెట్టాము. అప్పటికే మిఠాయి కొమ్ములు కూడా పూర్తి చేసాము.  హోటల్ వారిచ్చిన, చక్కని పప్పు, మేము తీసుకు వెళ్ళిన చింతకాయ పచ్చడి, మామిడికాయ ముక్కలు పచ్చడి, పంచదార వేసిన మీఠా పెరుగుతో, జీరా రైస్, బాసుమతి రైస్ తో భోజనం పూర్తి చేసాము. అప్పటికి మధ్యాహ్నం 1.30 అయింది. 

***


మాకోసం హొటల్ వారు మాట్లాడిన (వారి కారులో) మా కలకత్తా టూర్ మొదలైంది. విశాలమైన, శుభ్రంగా ఉన్న ఖాళీ రోడ్లపై మా ప్రయాణం మొదలైంది. హోలీ పౌర్ణమి దర్మామా అని నిరంతరం బిజీగా ఉండే, ఆరొడ్లలో ఖాళీగా ఇలా వెడుతుంటే చాలా బాగా అనిపించింది. మొదట మూసివున్న విక్టోరియా మెమోరియల్ మ్యూజియం బయటినుంచి చూసాము. తరువాత కొద్దిదూరంలోనే ఉన్న క్రికెట్ స్టేడియం చూసాము. అక్కడి నుంచి గంగానదిని దర్శించుకున్నాము. కొంచెంసేపు అక్కడ నుంచి అతివేగంగా, ఉధృతంగా ప్రవహిస్తున్న గంగను చూసి, మళ్ళీ బేలూరు వైపు మా ప్రయాణం మొదలు పెట్టాము. దారి పొడుగునా పార్క్ చేసిఉన్న కార్లు, టెక్సిలు, టుట్టోలు, చూస్తూ అవన్నీ రోడ్డుమీద నడిస్తే మా ప్రయాణం ఇంత హాయిగా ఉండేది కాదు అనుకుంటూ వుండగానే, మన, "హౌరా వారథి" మీద అయిదు నిమిషాలు ప్రయాణం చేసాము. గంగానది మీదా ఎంతో పురాతనమైన ఆ బ్రిడ్జి చూడటం చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి బేలూరు వస్తె, ఇంకా గంటకు కానీ ఆశ్రమం తెరవరని చెప్పారు. అక్కడే ఒక బడ్డీ కొట్టువారిని మా డ్రైవర్ బెంగాలీలో మాట్లాడి చాలా రుచిగా ఉన్న కుండ చాయ్ ఇప్పించాడు. అన్నీ దుకాణాలు మూసే ఉన్నాయి. ఒక్క బడ్డీ కొట్టు కూడా తెరచి లేదు. అందుకే కార్లో కాలక్షేపం కష్టం అని డ్రైవర్ నిర్ణయించి, మమ్మల్ని, దక్షిణేశ్వర్ లో ఉన్న కాళీమాత గుడికి ప్రయాణం మొదలు పెట్టాడు. మళ్ళీ గంగానదిని చూస్తూ దక్షిణేశ్వర్ వచ్చాము. 

అక్కడ ఉన్న రష్ చూసి కొంచెం భయపడ్డాము. బోలెడన్ని చిన్న చిన్న వేన్ లలో ప్లాస్టిక్ మరచెంబులు కట్టుకుని చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి భాంగ్ త్రాగి, హోలీ ఆదుకున్న జనాలు, అక్కడి గంగా నదిలో స్నానం చేసి, కాళీ మాతను, ద్వాదశ లింగాలను దర్శించుకుంటారు అని చెప్పారు. అందుకే ఊరంతా పూర్తిగా శలవు పాటిస్తారట. 

మొత్తానికి 3.30 కి అమ్మవారి ఆలయం ఓపెన్ చేశారు. అప్పటికే నాలుగు గుమ్మాలనుంచి నాలుగు లైన్ల జనం నుంచున్నాము. మా లక్ష్మీ, వరుసలో వుండగానే, ఆ స్థల పురాణం చెప్పింది మాకు. చిన్నప్పటి నుంచి చదువుకునే కథలు రాణీ రాస్మణీదేవి, శారద మాత, వివేకానందుల కథలను తలుచుకున్నాము. ఆలయం తలుపులు తీసిన తరువాత మేము రాంగ్ వరుసలో ఉన్నాము అని తెలిసింది. అమ్మవారు ప్రక్కనుంచి కనిపించింది. ఆలయం తియ్యగానే మొదటి దర్శనం అనుభూతి చెంది. మళ్ళీ అమ్మవారిని ముందు నుంచి దర్శనం చేసుకునే వరుసలో నిలబడి,  రామకృష్ణ పరమహంసను ఆయన కథలను తలుచుకుంటూ ఉన్నాము. 

కొంచెం సేపటికి ఆమెను పూర్తి స్వరూపం కళకళ లాడుతున్న ఆ మూర్తిని చూసి మనసారా దర్శించుకున్నాము. అక్కడే ఉన్న ద్వాదశ లింగాలను, రాసమణీ దేవీ పూలతోటలు, గంగానదిని దర్శించుకున్నాము. కొంచెం సేపు కూర్చుని, మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టాము బేలూరు వైపు. 

***

చల్లని సాయంకాలం గంగానది ఒడ్డున ఉన్న ఆ మఠం దర్శించటం చాలా బావుంది. రామకృష్ణుడి ఆలయం, శారదా మాత ఆలయం దర్శించుకుని, ఆ పరిసరాల్లో కాసేపు నడచి తిరిగాము. గంగానదిని చూస్తూ కొంచెంసేపు గడిపాము. ఫాల్గుణపౌర్ణమి ఇలాంటి వరం ప్రసాదించింది. దాన్ని పూర్తిగా మనసైన చెలిమితో పంచుకుంటూ ఆస్వాదించాము. చాలా సమయం గడుస్తుండటంతో, కాళికామాత దేవాలయం వైపుగా మళ్ళీ ప్రయాణం మొదలైంది, ఖాళీగా ఉన్న రోడ్లమీద.

***

ఫాల్గుణ పౌర్ణమి కాళీమాత దర్శనం ఆమె ఇచ్చిన వరమే మా అందరికీ! ఆ చల్లని సాయంకాలం, అమ్మవారి పాదాలకు తల ఆనించి నమస్కరించుకునే అవకాశం కంటే, ఇంకేం కావాలి? "తల్లీ ఇలా అనుగ్రహిస్తే చాలు అనుకుంటూ, ఆమెను దర్శించుకుని, ఏ పండాల హడావుడి బయట లేదు నిన్న. హాయిగా దర్శనం మాత్రం తృప్తిగా అయింది. మనసు నిండిన తృప్తితో  మళ్ళీ మా హోటల్ గదులకు వచ్చేసాము. 

***

గదికి వచ్చి, స్నానం చేసి, భోజనంగా చపాతీ, ఆలు కూర, మిక్స్డ్ వెజిటబుల్ కూర, మంచి నిమ్మకాయ మజ్జిగతో డిన్నర్ పూర్తయింది. 

***

ఇవాళ్టి ప్రోగ్రాం చూద్దాం ఏంటో!