Thursday 9 May 2024

వెస్ట్ బెంగాల్-1








25.3.2024 ఉదయం 5.30 కి ఇంటి నుంచి బయలుదేరాము ఆరుగురు కుటుంబసభ్యులము. 

మొదట హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కు వచ్చాము. అక్కడ, ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరే ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో కలకత్తాకు మా ప్రయాణం. ఈ మొత్తం టూర్ ప్లానర్ స్ Indira Jonnalagadda, Lakshmi Palaparthi గారి అమ్మాయి వీణ, అల్లుడు కలిసి చేశారు. 

లక్ష్మీ మా అందరికీ బ్రేక్ ఫాస్ట్ కోసం వేడివేడి ఇడ్లీలు చేసి తెచ్చింది. కారంపొడి నెయ్యి, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితో అవి 7.30 కల్లా తినేసాము. మొత్తం లగేజ్ చెకిన్ చేసి,   ఎయిర్ పోర్ట్ లో,  మా విమానం కోసం మొత్తం నడక 25 నిమిషాలు నడిచే సరికి అలిసి, ఆకలితో చక్కని అల్పాహారం తిని, విమానం ఎక్కి చక్కగా ఒకనిద్ర పూర్తి చేసాము. 

కలకత్తా, "సుభాష్ చంద్రబోస్" విమానాశ్రమంలో, చెక్ అవుట్ చేసుకుని బయటకు మా లగేజ్ తో పాటు వచ్చాము. అప్పటికే మా కొరకు వచ్చిన మా వెస్ట్ బెంగాల్ టూర్ ప్లానర్ పంపిన మా వాహనచోదకుడు వచ్చి ఉన్నాడు, ఒక శుభవార్తతో! ఆరోజు హోలీపౌర్ణమి కారణంగా పూర్తిగా వెస్ట్ బెంగాల్ కు సెలవుకారణంగా ఏమీ ఉండవు అని, ఇవాల్టికి చక్కగా హోటల్ గదిలో విశ్రాంతిగా ఉండమని మమ్మల్ని హోటల్ లో చెక్ ఇన్ చేయించి వెళ్ళిపోయాడు. 

ఇక హోటల్ అతనితో మాట్లాడితే, తనకు తెలిసిన కారు ఒకటి మాట్లాడి, చక్కని క్రొత్త కారోకటీ మాట్లాడి, ఆలయాలు తీసే ఉంటాయి, కనుక అవిమాత్రమే చూడగలమని చెప్పి చెకిన్ చేయించాడు. హోటల్ గదుల్లో సామాను పెట్టుకుని చక్కగా వారిచ్చిన కాఫీ త్రాగి, కొంచెం సేపు ఆలోచించుకుని, ఆలయదర్శనాలకు  వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాము. 

అక్కడే మధ్యాహ్నం భోజనంలో కలకత్తా రసగుల్లాతో మొదలు పెట్టాము. అప్పటికే మిఠాయి కొమ్ములు కూడా పూర్తి చేసాము.  హోటల్ వారిచ్చిన, చక్కని పప్పు, మేము తీసుకు వెళ్ళిన చింతకాయ పచ్చడి, మామిడికాయ ముక్కలు పచ్చడి, పంచదార వేసిన మీఠా పెరుగుతో, జీరా రైస్, బాసుమతి రైస్ తో భోజనం పూర్తి చేసాము. అప్పటికి మధ్యాహ్నం 1.30 అయింది. 

***


మాకోసం హొటల్ వారు మాట్లాడిన (వారి కారులో) మా కలకత్తా టూర్ మొదలైంది. విశాలమైన, శుభ్రంగా ఉన్న ఖాళీ రోడ్లపై మా ప్రయాణం మొదలైంది. హోలీ పౌర్ణమి దర్మామా అని నిరంతరం బిజీగా ఉండే, ఆరొడ్లలో ఖాళీగా ఇలా వెడుతుంటే చాలా బాగా అనిపించింది. మొదట మూసివున్న విక్టోరియా మెమోరియల్ మ్యూజియం బయటినుంచి చూసాము. తరువాత కొద్దిదూరంలోనే ఉన్న క్రికెట్ స్టేడియం చూసాము. అక్కడి నుంచి గంగానదిని దర్శించుకున్నాము. కొంచెంసేపు అక్కడ నుంచి అతివేగంగా, ఉధృతంగా ప్రవహిస్తున్న గంగను చూసి, మళ్ళీ బేలూరు వైపు మా ప్రయాణం మొదలు పెట్టాము. దారి పొడుగునా పార్క్ చేసిఉన్న కార్లు, టెక్సిలు, టుట్టోలు, చూస్తూ అవన్నీ రోడ్డుమీద నడిస్తే మా ప్రయాణం ఇంత హాయిగా ఉండేది కాదు అనుకుంటూ వుండగానే, మన, "హౌరా వారథి" మీద అయిదు నిమిషాలు ప్రయాణం చేసాము. గంగానది మీదా ఎంతో పురాతనమైన ఆ బ్రిడ్జి చూడటం చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి బేలూరు వస్తె, ఇంకా గంటకు కానీ ఆశ్రమం తెరవరని చెప్పారు. అక్కడే ఒక బడ్డీ కొట్టువారిని మా డ్రైవర్ బెంగాలీలో మాట్లాడి చాలా రుచిగా ఉన్న కుండ చాయ్ ఇప్పించాడు. అన్నీ దుకాణాలు మూసే ఉన్నాయి. ఒక్క బడ్డీ కొట్టు కూడా తెరచి లేదు. అందుకే కార్లో కాలక్షేపం కష్టం అని డ్రైవర్ నిర్ణయించి, మమ్మల్ని, దక్షిణేశ్వర్ లో ఉన్న కాళీమాత గుడికి ప్రయాణం మొదలు పెట్టాడు. మళ్ళీ గంగానదిని చూస్తూ దక్షిణేశ్వర్ వచ్చాము. 

అక్కడ ఉన్న రష్ చూసి కొంచెం భయపడ్డాము. బోలెడన్ని చిన్న చిన్న వేన్ లలో ప్లాస్టిక్ మరచెంబులు కట్టుకుని చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి భాంగ్ త్రాగి, హోలీ ఆదుకున్న జనాలు, అక్కడి గంగా నదిలో స్నానం చేసి, కాళీ మాతను, ద్వాదశ లింగాలను దర్శించుకుంటారు అని చెప్పారు. అందుకే ఊరంతా పూర్తిగా శలవు పాటిస్తారట. 

మొత్తానికి 3.30 కి అమ్మవారి ఆలయం ఓపెన్ చేశారు. అప్పటికే నాలుగు గుమ్మాలనుంచి నాలుగు లైన్ల జనం నుంచున్నాము. మా లక్ష్మీ, వరుసలో వుండగానే, ఆ స్థల పురాణం చెప్పింది మాకు. చిన్నప్పటి నుంచి చదువుకునే కథలు రాణీ రాస్మణీదేవి, శారద మాత, వివేకానందుల కథలను తలుచుకున్నాము. ఆలయం తలుపులు తీసిన తరువాత మేము రాంగ్ వరుసలో ఉన్నాము అని తెలిసింది. అమ్మవారు ప్రక్కనుంచి కనిపించింది. ఆలయం తియ్యగానే మొదటి దర్శనం అనుభూతి చెంది. మళ్ళీ అమ్మవారిని ముందు నుంచి దర్శనం చేసుకునే వరుసలో నిలబడి,  రామకృష్ణ పరమహంసను ఆయన కథలను తలుచుకుంటూ ఉన్నాము. 

కొంచెం సేపటికి ఆమెను పూర్తి స్వరూపం కళకళ లాడుతున్న ఆ మూర్తిని చూసి మనసారా దర్శించుకున్నాము. అక్కడే ఉన్న ద్వాదశ లింగాలను, రాసమణీ దేవీ పూలతోటలు, గంగానదిని దర్శించుకున్నాము. కొంచెం సేపు కూర్చుని, మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టాము బేలూరు వైపు. 

***

చల్లని సాయంకాలం గంగానది ఒడ్డున ఉన్న ఆ మఠం దర్శించటం చాలా బావుంది. రామకృష్ణుడి ఆలయం, శారదా మాత ఆలయం దర్శించుకుని, ఆ పరిసరాల్లో కాసేపు నడచి తిరిగాము. గంగానదిని చూస్తూ కొంచెంసేపు గడిపాము. ఫాల్గుణపౌర్ణమి ఇలాంటి వరం ప్రసాదించింది. దాన్ని పూర్తిగా మనసైన చెలిమితో పంచుకుంటూ ఆస్వాదించాము. చాలా సమయం గడుస్తుండటంతో, కాళికామాత దేవాలయం వైపుగా మళ్ళీ ప్రయాణం మొదలైంది, ఖాళీగా ఉన్న రోడ్లమీద.

***

ఫాల్గుణ పౌర్ణమి కాళీమాత దర్శనం ఆమె ఇచ్చిన వరమే మా అందరికీ! ఆ చల్లని సాయంకాలం, అమ్మవారి పాదాలకు తల ఆనించి నమస్కరించుకునే అవకాశం కంటే, ఇంకేం కావాలి? "తల్లీ ఇలా అనుగ్రహిస్తే చాలు అనుకుంటూ, ఆమెను దర్శించుకుని, ఏ పండాల హడావుడి బయట లేదు నిన్న. హాయిగా దర్శనం మాత్రం తృప్తిగా అయింది. మనసు నిండిన తృప్తితో  మళ్ళీ మా హోటల్ గదులకు వచ్చేసాము. 

***

గదికి వచ్చి, స్నానం చేసి, భోజనంగా చపాతీ, ఆలు కూర, మిక్స్డ్ వెజిటబుల్ కూర, మంచి నిమ్మకాయ మజ్జిగతో డిన్నర్ పూర్తయింది. 

***

ఇవాళ్టి ప్రోగ్రాం చూద్దాం ఏంటో!

Thursday 11 April 2024

శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం

తూర్పుగోదావరి జిల్లాలోని, పవిత్రగోదావరినది ఒడిలో ఉన్న కోనసీమలో పచ్చని పంటపైరులు, కొబ్బరిచెట్లమధ్య కుండలేశ్వరం అనే ఊరిలో, ఒక శివాలయం ఉన్నది. ఆలయంలోని స్వామి కుండలేశ్వరుడు. వృద్ధ గౌతమీనది పుణ్యజలంలో స్నానమాచరించి, ఆ తర్వాత కుండలేశ్వరుని దర్శించి, భక్తిశ్రద్ధలతో పూజలు జరిపెంచుకుంటారు అక్కడికి వచ్చే భక్తులు. కవి స్వారభౌముడైన శ్రీనాధమహాకవి తన భీమఖండం (భీమేశ్వరపురాణం)లో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశాడు. గౌతమీ మహత్మ్యం అనే గ్రంథంలో ఈ క్షేత్రమహిమను గురించి నూటమూడవ అధ్యాయంలో ఉంది. *** ఈ కుండలేశ్వరం క్షేత్రం దగ్గర చాలా వేగంగా వెళుతున్న గోదావరి, సముద్రఘోషని విని కోపంతో, ఉధృతమైన మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి, అక్కడ ఉన్న సముద్రుడ్ని బెదిరించాలి అనుకుంది. అయితే, గోదావరి ఆలోచనలను సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యలను, రెండు కుండలాలను ఒక పశ్ళెంలో వుంచి గౌతమికి ఎదురెళ్లాడు. గౌతమీ నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు. సూర్యభగవానుని తేజస్సుతో మెరు స్తున్న ఈ రెండు కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణ దేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమీ నది కరిగిపోయి, సముద్రుని కోరికమేరకు తన వేగాన్ని తగ్గించు కుని, అక్కడ ఈశ్వర ప్రతిష్ఠకి అంగీకరించింది. సముద్రుడు గౌతమీనదికి కానుకగా రెండు కుండలములను ప్రసాదించాడు. అందులో ఒకదానిని మానవులు శ్రేయస్సు కొరకు కుండలేశ్వర క్షేత్రమున ప్రతిష్టించిన లింగము కొరకు, రెండవ కుండలమును దేవతల కొరకు నదీ గర్భంలో స్థాపించబడినదని ఆ క్షేత్ర అర్చకులు చెబుతారు. అందుకే ఆ క్షేత్రమునకు కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది అని చెప్పారు. ***
నదీగర్భంలో ప్రతిష్ఠ చేసిన శివుని ఆలయం కంచుతో దేవతలే స్వయంగా నిర్మించారని ఇక్కడి స్థలపురాణం వెల్లడిస్తోంది. దేవతలు ఈశ్వరునికి ప్రతి రాత్రి పూజాభిషేకాలు జరుపుతున్నట్లుగా తెలియచేయబడింది. రాత్రి సమయంలో గోదావరీ నదిలోంచి, ఆ ప్రాంతాన కంచు గంటలు మ్రోగిన ధ్వనులు వినిపిస్తాయని ఇక్కడి వృద్ధులు చాలామంది చెప్తారు. గౌతముడు ఒక వృద్ధ స్ర్తితో కలసి ఈ కుండలేశ్వర క్షేత్రానికి వచ్చి, ఈ నదిలో స్నానం చేసిన తర్వాత, ఆ వృద్ధ మహిళ చిన్న యవ్వనవతిగా, ఒక కన్యగా మారిపోయిందనీ, గౌతముడు కూడా యువకునిగా మారినట్లు, ఆ తర్వాత వారిద్దరూ దంపతులై నూతన జీవితాన్ని ఆరంభించినట్లుగాను స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. గౌతమీ మహాత్యమను గ్రంథం ద్వారా కూడా తెలుసుకోవచ్చును. *** కుండలేశ్వరము దక్షిణ కాశీగా పేరుపొందింది. ఈ క్షేత్రమును గురించి, మార్కండేయుడు రచించిన చంద్రశేఖరాష్టకంలో ఉన్నది. కుండలేశ్వర ఆలయ విమాన గోపురం మీద ఇరవైమూడు శివలీలలు వర్ణింపబడి ఉన్నాయి. శివుని వివిధ రూపాలు, ఆ విమాన గోపురం మీద దర్శనమివ్వడమన్నది ఈ ఆలయపు ప్రత్యేక విశేషం. ఆ రూపాలు 1) నటరాజస్వామి 2) వీరభద్రుడు 3) లింగోద్భవమూర్తి 4) సోమాస్కందమూర్తి 5) భిక్షాటనమూర్తి 6) కిరాతమూర్తి 7) హరిహరమూర్తి 8) కల్యాణసుందరమూర్తి 9) చండశానుగ్రహమూర్తి 10) శరభసాళ్ళమూర్తి 11) అర్థనారీశ్వరుడు 12) మన్మధ సంహారి 13) గణేశానుగ్రహమూర్తి 14) ఏకపాదుడు 15) వృషభారూఢుడు 16) దక్షిణామూర్తి 17) ఆజారిమూర్తి 18) విషాన హరుణుడు 19) కంకాళుడు 20) త్రిపురాసుర సంహారుడు 21) చక్రపధానుడు 22) చండశానుగ్రహుడుతోపాటు ముఖ మంటపంపైన భక్తమార్కండేయుడు ఉంటాడు. వ్యాస మహర్షిని కాశీలో శివుడు కాసీబహిష్కరణ విధించినప్పుడు వ్యాసుడు ఆగ్రహంతో కాశీ నుంచి వచ్చిన సమయంలో, కుండలేశ్వరంను దక్షిణ కాశీగానూ, సమీపంలో ఉన్న, వ్యాసునిచే ప్రతిష్టింపబడిన వ్యాసేశ్వరుని గ్రామమున కేశవకుర్రును వ్యాసకాశీగానూ చేయాలని నిశ్చయించుకున్నాడు. కాశీలోని గంగానదిలో, అనేక వేల మంది భక్తులు స్నానమాచరించి, తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. గంగామాతకు అంటుకున్న ఆ పాపాలను పోగొట్టుకోలేక కాశీ నుంచి వచ్చి రాత్రి సమయంలో, కుండలేశ్వర క్షేత్రంలో ని వృద్ధ గౌతమీనదిలో మునిగి, ఆ నీటిలో స్నానమాచరించి, తనలోని మలినాలను పోగొటుకుని ఆ నీటిలో పవిత్రతను సాదించుకుంటుంది అని ఇక్కడి స్థల పురాణం.
ఇక్కడి గోదావరిలో స్నానం చేసి, కాశీ గంగలో స్నానం చేస్తే గంగకు మైల అంటదని ప్రతీతి! ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కరసమయంలో స్నానదానపూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని స్థల మహత్యం చెప్తుంది. ఇక ఈ ఆలయ పూజారులు 700 సంవత్సరాలనుంచీ పరంపరగా కొనసాగుతున్నారని అర్చకుల కుటుంబంలోని ఆరవతరం ఆయన చెబుతున్నారు. ***
కుండలేశ్వరుని దర్శించి కాశీ క్షేత్ర దర్శనం చేసుకుంటే గానీ సంపూర్ణ కాశీయాత్ర పుణ్యం లభించదని భీమేశ్వర పురాణంలో ఉన్నదట! అందుకని అందమయిన నదీసాగర సంగమం లోని ఈ క్షేత్ర దర్శనం చేసుకుని తరిద్ధామా!